స్వాతంత్ర్యం రాక పూర్వం భారతదేశాన్ని అనేక రాజవంశాలవారు పరిపాలించారు. స్వాతంత్రం తరువాత రాజ్యాలు, రాజులు వారి రాజ వంశాలు కాల గర్భంలో కలిసిపోయాయి. ఆనాటిపాలకుల వారసులలో చాలామంది క్రమ క్రమంగా ప్రజలకు దూరమవుతూ, వ్యాపారవేత్తలుగానో లేక రాజకీయనాయకులుగానో మారిపోయారు. అయితే ఆనాటి పాలకులు నిర్మించిన కట్టడాలు, కోటలు వారి ఘనచరిత్రకు జ్ఞాపకాలుగా ఇంకా నిలిచే ఉన్నాయి. అవి ఆనాటి చరిత్రకు, నాగరికతకు, ఆర్థిక సామజిక పరిస్థితులకు సాక్ష్యాలు. వాటిలో కొన్ని పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో వుండగా కొన్ని ఆలనా పాలన లేక దోపిడికి గురౌతున్నాయి.
ఆ నాటి కోటలు నిధినిక్షేపాలకు ఆలవాలమే గాదు, విజ్ఞాన బాండాగారాలు, సాంస్కృతిక సంపదకు నిలయాలు. వీటి పరి రక్షణ భావి తరాలకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ప్రతీ కోటా ఎంతో చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకుంది. అవి మన చరిత్రకే కాదు మన సంస్కృతి,వ్యవహారాలకు ఘన వారసత్వాలు. అటువంటి అద్భుతమైన చరిత్రకలిగిన కొన్ని కోటలను గురించి మనం తెలుసుకుందాం. ఈ కోటలగురించి ఒక సిరీస్ లాగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాము. దానిలో భాగంగా ఇవాళమనం చిత్తోర్ ఘడ్ కోట గురించి తెలుసుకుందాం.
రాజస్థాన్ లో ఉన్న చిత్తోర్ ఘర్ పట్టణం అనేక ప్రాచీన కట్టడాలకు, సంపదకు నిలయం. ఈ పట్టణంలో ఒక కొండపై విశాలమైన నిర్మించిన చిత్తోర్ ఘర్ కోట మేవార్ రాజ పుత్రుల వైభవానికి, పరాక్రమానికి, ఇంకా రాజపుత్ర స్త్రీల త్యాగానికి ప్రతీక. శక్తివంతమైన, అద్భుతమైన చిత్తోర్ ఘడ్ కోట చిత్తోర్ పట్టణ గత వైభవాన్ని వర్ణిస్తుంది. ఇది పట్టణానికి ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. 700 ఎకరాల లో విస్తరించి ఉన్న ఈ నిర్మాణం 180 మీ. ల ఎత్తులో ఒక కొండపై ఉంది.
కోట చరిత్ర - లభిస్తున్న ఆధారాలప్రకారం మౌర్యులు ఈ కోటను 7 వ శతాబ్దం లో నిర్మించారు. మౌర్య వంశానికి చెందిన చిత్రాంగద్ మోరి ఈకోటకి పునాదులు వేసినట్లు చెబుతారు. తర్వాత 8వ శతాబ్ధంలో ఈకోట సిసోడియా రాజవంశానికి చెందిన బప్పా రావల్ ఆధీనంలోకి వచ్చింది. అయితే ఇది ఎలా చేతులు మారిందన్నదానికి సరైన ఆధారాలులేవు. కొన్ని ఆధారాలప్రకారం ఈకోట అతనికి కానుకగా లభించింది.
మేవార్ రాజ్యాన్ని 13వశతాబ్ధంవరకూ సిసోడియా రాజవంశీయులే చిత్తోర్ రాజధానిగా చేసుకుని నిరాఘాటంగా పరిపాలించారు. వారి కాలంలో ఈకోట ఎంతో అభివృద్ది చెందింది. దాని చుట్టుపక్కల కూడా అనేక గొప్ప నిర్మాణాలు జరిగాయి. మేవాడ్ రాజ్యంపై 1306లో అల్లావుద్దీన్ ఖిల్జి రూపంలో మొదటి దాడి జరిగింది. అనాగరికుడు, స్త్రీలోలుడు అయిన ఖిల్జి రాణి పద్మిని దేవి కోసం ఆ రాజ్యం మీద దాడి చేశాదు. ఆయుద్ధంలో మహారాజు రతన్ సేన్ మరణించడంతో శతృవులకు చిక్కడం ఇష్టంలేని పద్మినీదేవి అక్కడే కోటలో ఆత్మార్పణం చేసుకుంది. దానితో కొంతకాలం ఆకోట ఖిల్జీ వశమయ్యింది 1326లో ఈకోట మళ్ళీ రాజపుత్రుల అధీనంలోకి వెళ్ళింది. తర్వాత 15వ శతాబ్ధంలో మొఘలుల చేతిలో మరొకసారి దాడికి గురయ్యింది.
**********
ఇది స్థూలంగా చిత్తోర్ ఘర్ కోట చరిత్ర
గతంలో అనేక భారీ విధ్వంసాలు జరిగినప్పటికీ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనమైన ఈ కోట వాటన్నీటినీ తట్టుకుని ధృఢంగా నిలిచింది. ఈ కోటకు వచ్చే మార్గం అంత సులభంగా ఏమీ ఉండదు. కొంతవరకూ నిటారుగా, తర్వాత కొంతదూరం మెలికలు తిరిగిఉండే రాచ బాట వెంబడి ఒక మైలు నడవవలసి ఉంటుంది.ఈ కోటకు దేవతల పేర్లు ఉన్న మేకులు కొట్టిన ఏడు పెద్ద ఇనుప గేట్లు ఉన్నాయి. అనేక అందమైన దేవాలయాలతో బాటుగా బ్రహ్మాండమైన రాణి పద్మిని భవనం, మహారాణ కుంభ భవనం ఉన్నాయి. వర్షం ద్వారా నిండే అనేక సహజనీటి జల వనరులు ఈ కోట లోపల ఉన్నాయి.
చిత్తోర్ ఘడ్ కోటకు పశ్చిమ ప్రాంతంలో ఉన్న గొ ముఖ కుండ్ ఒక పవిత్ర జలాశయం. రాళ్లలోని పగుళ్ళ మధ్య నుండి నీరు జారి తర్వాత జలాశయం లోనికి వస్తాయి. రాణి బిందర్ సొరంగమార్గం మరొక ఆకర్షణ, ఈ సొరంగ మార్గం చిత్తోర్ ఘడ్ కు చెందిన రాణి పద్మిని జోహార్ అర్పించిన ఒక నేలమాళిగకు దారి తీస్తుంది. జోహార్ అంటే శతృవులకు చిక్కకుండా ఆత్మార్పణ చేసుకోవడం.
********
కోట, దాని చుట్టుపక్కల సందర్శించవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మొదటిది విజయ స్తంభం, క్రీ.శ. 1440 లో మహారాణ కుంభ ఈ స్తంభాన్ని నిర్మించాడు. మహమ్మద్ ఖిల్జీ పై మేవాడ్ రాజ్యం సాధించిన విజయానికి గుర్తుగా దీనిని నిర్మించాడు. 37 మీ.ఎత్తైన ఈ స్థంభంలో 9 అంతస్తులు ఉన్నాయి. హిందూ దేవతల చిత్రాలు ఈ స్తంభపు గోడల చెక్కారు. పురాణగాధలైన రామాయణ, మహాభారత౦ లోని వివిధ ఘట్టాలను వర్ణించే చిత్రాలు ఈ స్తంభం పై ఉన్నాయి.
తర్వాత చూడవలసింది కీర్తి స్థంభం: 22మీ. ఎత్తులో ఉన్న ఏడు అంతస్తుల కీర్తి స్తంభాన్ని, ప్రతిష్ట బురుజు అని కూడా అంటారు.ఇది మొదటి తీర్థంకరుడైన అధినాధునికి చెందినది. వసారాలు, గోడల పై అందమైన చెక్కడాలతో దీనిని సోలంకి శైలి లో నిర్మించారు. బురుజుల గోడలపై జైన తీర్థంకరుల చిత్రాలను మనం చూడచ్చు. అంతేకాక, రెండవ అంతస్తులో అద్భుతంగా చెక్కిన అధినాథుని శిల్పం ఉంది. ఈ రెండు స్థంభాలపైనుండీ చూస్తే చిత్తో పట్టణం పూర్తిగా మనకి కనిపిస్తుంది.
********
8 వ శతాబ్దంలో నిర్మించిన కాళికా మాత దేవాలయం, ఈ ప్రాంతపు పురాతన దేవాలయాలలో ఒకటి. సిసోడియా వంశస్తుడైన మహరాజు బప్పా రావాల్ మొదట దీనిని సూర్య దేవాలయంగా నిర్మించాడు. అయితే, 14 వ శతాబ్దంలో మహారాణ హమీర్ సింగ్ ఈ దేవాలయం లో ఒక కాళికా మాత విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటి నుండి ఇది కాళికా మాత దేవాలయంగా ప్రసిద్ది చెందింది. శౌర్యానికి, శక్తికి సంకేతమైన కాళికా మాత చిత్తోర్ ఘడ్ ను సంరక్షిస్తున్నదని అందరూ విశ్వసిస్తారు. ఈ దేవాలయం నిర్మాణశైలి - అనేక చిత్రాలు, శిల్పాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే ఉత్సవానికి భక్తులు కాళికా మాత దీవెనల కోసం పెద్ద సంఖ్యలో వస్తారు.
కుంభ శ్యామ్ దేవాలయం, ఇక్కడ వరాహస్వామిగా పూజలందుకొనే విష్ణు మూర్తి కొలువై ఉంటాడు. ఈ దేవాలయాన్ని తన కోడలైన మీరా ప్రత్యేక అభ్యర్ధన పై మొదటి మహారాణ సంగ్రామ్ సింగ్ నిర్మించాడు. ఇది చిత్తోర్ ఘడ్ కోటలో కుంభ దేవాలయానికి దగ్గరగా ఉంది.ఈ దేవాలయ నిర్మాణం చిత్తోర్ ఘడ్ లోనే ఉన్న కాళికా మాత దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఒక పిరమిడ్ రూపంలో గల బురుజు, ఒక ఎత్తైన పై కప్పుతో ఉండే ఈ అందమైన దేవాలయంలో మీరా గురువైన వారణాసికు చెందిన సంత్ రవిదాస్ పాదముద్రలు ఉన్నాయి. ఈ దేవాలయపు గోడలపై చాల మంది దేవుళ్ళు, దేవతల అందమైన చిత్రాలు ఉన్నాయి. ఇక్కడి నిర్మలమైన వాతావరణ౦, ధార్మిక ప్రాముఖ్యత భక్తులను ఎంతో ఆకర్షిస్తాయి.
మీరా దేవాలయం
రాజపుత్ర యువరాణి మీరాబాయి . ఆమె రాచరిక విలాసాలను విడిచిపెట్టి, తన జీవితమంతా కృష్ణుని పూజిస్తూ గడిపింది. కృష్ణుని స్తుతిస్తూ భజనలు చేస్తూ, పాటలు పాడుతూ జీవితాన్ని గడిపింది.
మీరా దేవాలయం రాజపుత్రుల నిర్మాణశైలి కి ఒక అద్భుతమైన మచ్చుతునక. ఈ దేవాలయాన్ని ఉత్తర భారతదేశశైలి లో నిర్మించారు. ఈ దేవాలయాన్ని చుట్టి ఉన్న వసారాలో నాలుగు వేదికలు ఉన్నాయి. మీరా, కృష్ణుల అనేక అందమైన, సజీవ చిత్రాలతో ఈ దేవాలయ లోపలి గోడలు అలకరించబడి ఉంటాయి.
తుల్జ భవాని దేవాలయం
తుల్జ భవాని దేవాలయం, క్రీ.శ.1535 లో నిర్మించిన ఒక పురాతన దేవాలయం. తుల్జ భవాని దేవతను తూర్య భవాని అనికూడా పిలుస్తారు. ఈ దేవాలయం చిత్తోర్ ఘడ్ ప్రధాన ద్వారమైన రాం పోల్ దగ్గర ఉంది. అనేకపురాణగాధలు ఇక్కడి గొడలపై చెక్కబడి ఉంటాయి. ఈ దేవాలయం చిత్తోర్ ఘడ్ వాసుల కళానైపుణ్యానికి ఒక నిదర్శనం.
********
దేవాలయాలతర్వాత చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిలో ఫట్ట స్మారకం ఒకటి. దీనిని చిత్తోర్ ఘడ్ కోటను శత్రువుల నుండి కాపాడడానికి జరిగిన యుద్ధంలో అసువులు బాసిన 16 ఏళ్ళ ధైర్య వంతుడైన ఫట్ట అనే బాలుని జ్ఞాపకార్థం నిర్మించారు.ఇది సభామందిరానికి సమీపంలో రామ్ పోల్ లోపల ఉంది. చిత్తోర్ ఘడ్ కోట ప్రధాన ద్వారమే రామ్ పోల్. ఇది హిందూ సంస్కృతికి, రాజపుత్రుల శౌర్యానికి ప్రతీక. ఇక్కడికి దగ్గరలో రాముని దేవాలయం ఉంది.
పద్మిని భవనం : దినినే పద్మిని ప్యాలెస్అనికూడా అంటారు. సౌందర్యవతి, ధైర్యవంతురాలు రాణి పద్మిని నివాసం. చిత్తోర్ ఘడ్ కోట లో ఉన్నఈ భవనం చుట్టూ రామర పూల కొలను ఉంటుంది.మూర్ఖుడైన సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ రాణి పద్మిని ప్రతిబింబాన్ని ఈప్రాంతంలోనే చూసినట్లు చెబుతారు. కామపిశాచి ఐన ఖిల్జీ ఆమె అందానికి ముఘ్ధుడై ఆమెను బలప్రయోగంతోనైనా దక్కించుకోవాలని యుద్ధం చేశాడు. యుద్ధంలో గెలిచినా ఆమెను మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఆ మూర్ఖులకు చిక్కడం ఇష్టంలేని రాణి పద్మిని మిగిలిన రాజపుత్ర స్త్రీలతో బాటు కోటలోనే ఒక నేల మాళిగలో అగ్నిప్రవేశం చేసింది. ee భవనం దగ్గరలో నీలకంఠ మహాదేవ శివాలయం ఉంది.
తర్వాత మరొక ముఖ్య నిర్మాణం రాణా కుంభ భవనం - మహారాణ కుంభ తన రాచరిక జీవితాన్ని గడిపిన చారిత్రిక కట్టడం రానా కుంభ భవనం. 15 వ శతాబ్దం లో కట్టిన ఈ గొప్ప భవనాన్ని భారతదేశంలోని ఉత్తమ నిర్మాణాలలో ఒకటిగా చెబుతారు.
ఇవన్నీ కోటలోపల, చుట్టుపక్కల ఉండే చారిత్రక కట్టడాలు. ఇవే కాకుండా బస్సి అభయారణ్యం, సీతామాత అభయారణ్యం ఇంకా చిత్తోర్ఘర్ మ్యూజియం ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. ఇవి ఫ్రెండ్స్ చిత్తోర్ ఘర్ కోట దాని చుట్టుపక్కల ఉండే ప్రసిద్ధ కట్టడాలకు సంబంధించిన విశేషాలు. తర్వాతి వీడీయోలో మరొక ప్రసిద్ధ కొటాకి సంబంధిన విశేషలతో మీముందుకు వస్తాం. అంతవరకూ bye bye.


0 Comments