హాయ్ ఫ్రెండ్స్, స్వాతంత్రానికి పూర్వం సమాచారవ్యవస్త పెద్దగా వ్యాపించని కాలంలో ప్రజలకి వార్తలు చేరవెయ్యడం,  సమకాలీన ప్రపంచంలో ఏంజరుగుతోందో వారికి తెలియజెయ్యడం అన్నది వార్తా పత్రికలద్వారానే జరిగేది. కానీ ఆ వార్తలుకూడా అందరికీ వెంటనే చేరేవికాదు. కొంతమంది ఉదారస్వభావులు, ప్రజలను చైతన్యం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, కొన్ని పత్రికలను కొని, రైళ్ళలో, బస్సులలో వేసి మారుమూల ప్రాంతాలకు కూడా పంపుతూ ఉండేవారు. అలా పంపిన పత్రికలు కూడా ఊరికి ఒకటి వంతున చేరేవి. అలాంటప్పుడు, వాటిల్లోని ముఖ్యమైన విషయాలను గ్రామప్రజలందరికీ చేరవెయ్యడానికి, ఊరిపెద్దలు, చైతన్యం కలిగిన వ్యక్తులు,  రచ్చబండ సమావేశాలు వంటి రకరకాల పద్ధతులను అనుసరించేవారు.  అటువంటి మరొక సృజనాత్మక పద్ధతే నెల్లూరు గోడపత్రిక. నెల్లూరు పట్టణంలోని తిప్పరాజువారి సత్రం ఆనాటి గోడపత్రికకు వేదిక. రకరకాల పత్రికలు చదివి, వాటిని విశ్లేషించుకుని, తెలియనివాటి అర్ధాలను, తెలిసినవారితో చెప్పించుకుని  సుద్దముక్కలతో, నల్లటిగోడపై రాసిన పత్రిక దాదాపు నలభై సంవత్సరాలు ఏవిధమైన లాభాపేక్ష లేకుండా నడిచింది.  బ్రిటిష్ పాలనలో పోలీస్ అధికారిగా పనిచేసిన నెల్లూరు వాసి తూములూరి పద్మనాభయ్య 1932లో ఈ గోడపత్రికను ఆరంభించారు. ముత్తరాజు గోపాలరావు గారు ఈ గోడపత్రికకు నగరజ్యోతి అని పేరు పెట్టారు. సంకల్పం గొప్పదైతే, సాధించడానికి దారులు అవే ఏర్పడాతాయనడనికి నిదర్శనం ఆగోడపత్రిక. 

పత్రిక ప్రారంభినచిన మొదట్లో దినపత్రికలనే తిప్పరాజువారి సత్రం గోడలపై అంటించేవారు. తర్వాత పాఠకులకు అది అంతగా సౌకర్యవంతంగా ఉండదని భావించి, ముఖ్యమైన వార్తలను  ఆయనే ఏరి, స్వయంగా పెద్ద పెద్ద కాగితాలపై రాసి, ప్రతిరోజు గోడకు అంటించేవారు. అయితే అలా అతికించిన కాగితాలు రోడ్లపై తిరిగే ఆవుల, గాడిదల పాలయ్యేవి. దాంతో తిప్పరాజువారి సత్రం గోడనే నల్లగోడగా మార్చి చాక్ పీసులతో వార్తలు రాయటం మొదలుపెట్టారాయన. నెల్లూరు ట్రంకురోడ్డులో ఉన్న తిప్పరాజువారి సత్రం గోడలపై నాలుగున్నర దశాబ్దాలపాటు ఆ పత్రిక నిర్విరామంగా జ్ఞానాన్ని పంచింది. స్వాతంత్రోద్యమ స్పూర్తితో, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన పద్మనాభయ్య, మొదట్లో నెల్లూరు లోని ఒక భూగృహంలో స్టెన్సిల్ మిషన్ ద్వారా ఒక రహస్య పత్రికను నడిపేవారు. అంతర్గతంగా పంపిణీ జరిగే కాంగ్రెస్ సర్క్యులర్లను, తన సహచరుల ద్వారా సేకరించిన ఇతర సమాచారాన్ని ఆధారం చేసుకొని ఆ రహస్య పత్రిక నడిచేది. పద్మనాభయ్యకి సహచరులుగా ఉన్న ముత్తరాజు గోపాలరావు, ఇంద్రకంటి సుబ్రహ్మణ్యం ఈ గోడపత్రికను కొనసాగించటంలో పాలుపంచుకున్నారు.  పద్మనాభయ్య గారి తర్వాత గోపాలరావు, ఇంద్రకంటి పత్రికను పోటీలు పడి నడిపారు. వాళ్ళిద్దరికోసం ఆ సత్రంలో రెండు గోడలు నల్లటి పైంటింగ్ వేసి ఉండేవి. ఇద్దరూ గాంధేయవాదులే, లాభాపేక్షలేని సంఘ సేవకులే. అయితే గోపాలరావుగారు ఇప్పటి 24 hours న్యూస్ చానెల్స్ లాగా కొంచెం సంచలనాలకి ప్రాధాన్యతనిచ్చేవారు. కానీ విలువలని మాత్రం ఏనాడూ కోల్పోలేదు. ఆయనకు వారసుడిగా గండవరపు హనుమారెడ్డి గారు కొంతకాలం పాటు వార్తలు రాశారు.